Terrace Gardens-Which size Containers to use

కూరగాయలు, ఆకుకూరలకు ఎంత సైజు కంటైనర్లు ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఏ కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవాలి అని అనుకుంటే వాటిని బట్టి కంటైనర్లను ఎంచుకోవాలి. వంకాయ, బెండకాయ, మిర్చి, టమోటా లాంటి మొక్కలకు ఎనిమిది అంగుళాల నుంచి ఒక అడుగు లోతు ఉన్న కంటైనర్లు కావాలి. ఒక మొక్కకు ఒక అడుగు వెడల్పు ఉండాలి. ఒక కుటుంబం అంటే నలుగురు ఉన్న సభ్యులకు కనీసం పన్నెండు నుంచి పదహారు మొక్కలు అవసరం అవుతాయి. ఆకుకూరలకు ఆరు నుంచి ఎనిమిది అంగుళాల లోతు, పదిహేను నుంచి పద్దెనిమిది అంగుళాల వెడల్పు ఉన్న కంటైనర్లు సరిపోతాయి. కుటుంబ అవసరాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి ఏరకం ఆకుకూరలు ఎన్ని రోజుల వ్యవధిలో అవసరం ఉంటాయి అని ఆలోచించి ఆ విధంగా సరిపోయేలా పెంచుకోవాలి.

తీగె జాతి మొక్కలకు ఒక అడుగు లోతు, కనీసం రెండు అడుగుల వెడల్పు ఉన్న కంటైనర్లు కావాలి. దానిలో రెండు విత్తనాలు పెట్టుకోవాలి. నాలుగు అడుగుల వెడల్పు ఉన్న కంటైనర్లు అయితే తీగె జాతి మొక్కలకు బాగుంటాయి. పాదులకు వేరు వ్యవస్థ సమాంతరంగా వ్యాపిస్తుంది కాబట్టి వెడల్పు ఎక్కువ ఉన్న కంటైనర్లు కావాలి. ఒక కుటుంబానికి సరిపడా పంట రావాలంటే ఒక్కో రకం విత్తనాలను నాలుగైదు పెట్టుకోవాలి. అప్పుడే పాలినేషన్ సమస్య లేకుండా, కుటుంబానికి సరిపడా పంటను పండించుకోవచ్చు. ఏకాలంలో ఏ పంటలు పండుతాయో తెలుసుకుని పండించుకోవాలి. చలికాలంలో పెరిగే కూరగాయలను ఎండాకాలంలో పెంచితే అవి సరిగా పెరగవు. ఎండాకాలం, వానాకాలంలో పెరిగే కూరగాయలు చలికాలంలో పెరగవు. కాబట్టి ఏకాలంలో పెరిగే కూరగాయలను ఆకాలంలో పెంచుకోవడం వలన ఎక్కువ దిగుబడిని పొందవచ్చు.

(మిద్దెతోట మొదలుపెట్టి చేస్తున్నవారు మీ మీ పధ్ధతులలో చేయవచ్చు. ఇది కొత్తగా మొదలు పెట్టేవారి కోసం రాసినది)

-లత కృష్ణమూర్తి

Shopping Cart