మనం ఆరోగ్యం కోసం కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే కూరగాయలు, ఆకు కూరలపై మితిమీరి పురుగు మందుల్ని చల్లేస్తున్నారు. అందుకనే ఆకు కూరల్ని వండుకునేప్పుడు చాలా మంది పురుగు మందుల వాసనను ఒక్కోసారి సెన్స్ చేస్తూ ఉంటారు. మరి ఎలాంటి పురుగు మందులూ లేకుండా మనం ఆకుకూరల్ని తినాలంటే ఇంటి దగ్గరే వాటిని పెంచుకోవాలి. అంత స్థలం లేని వారికి మైక్రో గ్రీన్స్ మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఆకు కూరలతో పోలిస్తే వీటిని పెంచడమూ తేలికే. పోషకాలూ ఎక్కువే.
వేటిని మైక్రో గ్రీన్స్‌గా పెంచుకోవచ్చు:
ఆవాలు, మెంతులు, పెసర్లు, బీట్‌రూట్, బ్రోకలీ, కాలే, ఎర్ర క్యాబేజీ గింజలు, ర్యాడిష్ విత్తనాలు తదితరాలను మైక్రో గ్రీన్స్‌గా పెంచుకోవచ్చు. చిన్న చిన్న కుండీల్లో కాస్త మట్టి వేసి వీటిని ఒత్తుగా చల్లుకుని రోజూ నీటిని స్ప్రే చేస్తూ ఉండాలి. ఆరు నుంచి పది రోజుల్లోపు వీటిని కోసేసుకోవచ్చు. రెండు నుంచి మూడు అంగుళాలు ఎదిగితే ఇక కోసేసుకోవచ్చని అర్థం చేసుకోవాలి.
మైక్రో గ్రీన్స్‌ని ఎలా ఉపయోగించుకోవాలి:
ఈ చిన్న మొలకల్లాంటి ఆకుల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎక్కువగా వేడి చేసి వండేయడం ద్వారా అవి నశిస్తాయి. బదులుగా వాటిని కూర వండుకున్న తర్వాత చివర్లో కొత్తిమీర చల్లుకున్నట్లు చల్లి దించేసుకోండి. అప్పుడు ఎక్కువ పోషకాలు మన శరీరంలోకి చేరి మనం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. అలాగే స్మూతీల్లో చేర్చుకోవచ్చు. కాస్త వెన్నలో ఒక్క నిమిషం పాటూ వేయించి తినొచ్చు. ఇంకా సలాడ్లలో నేరుగా చేర్చకోవచ్చు. బర్గర్లు, పీజాలు, రోల్స్ లాంటి వాటిలో పైన టాపింగ్‌లా పెట్టుకుని ఆరగించవచ్చు.
మైక్రో గ్రీన్స్‌లో పోషకాలు :
మైక్రో గ్రీన్స్‌లో మెగ్నీషియం, మాంసనీసు, ఐరన్ లాంటివి సమృద్ధిగా ఉంటాయి. పచ్చిగా ఎక్కువ తింటాం కాబట్టి ఈ పోషక విలువలు తగ్గిపోకుండా శరీరానికి అందుతాయి. అలాగే వీటిలో 40 శాతం వరకు ఫైటో కెమికల్స్ ఉంటాయి. మామూలు ఆకు కూరలతో పోలిస్తే వీటిలో 40 రెట్లు అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మైక్రో గ్రీన్స్ తినడం వల్ల లాభాలు :
వీటిని తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జ్ఞాపక శక్తి తగ్గదు. మధుమేహం ప్రమాదం తగ్గుముఖం పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లూ దరి చేరవు.
Courtesy:
Gnana kumudini
CTG Kakinada