CTG STALL -MAHABUBNAGAR RYTHU SADASSU

దిగ్విజయంగా ప్రజ్వరిల్లిన సి టి జి (సిటి ఆఫ్ టెర్రస్ గార్డెన్స్) మహబూబ్ నగర్ ప్రదర్శన – రూపు దిద్దుకుంటున్న మరో హరిత విప్లవం

తెలంగాణ ప్రభుత్వము 2024 నవంబరు 28,29 మరియు 30 తేదీలలో మహబూబ్ నగర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ లో భాగంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మన సి టి జి నిర్వహించిన స్టాల్, ఆ మూడు రోజులు రైతు పండుగకు విచ్చేసిన ఎందరో రైతులనే కాకుండా, మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న మరెందరినో ఎంతగానో ఆకర్షించింది.

“నువ్వు పండించినదే తిను – నువ్వు తినేదే పండించు” అనే మన నినాదం రైతు పండుగకు విచ్చేసిన అందరి మనసుల్లో బాగా నాటుకుంది. ఆ నినాదం, అందులో అంతర్లీనమైన మిద్దె తోటల పెంపకం వల్ల కలిగే ఎన్నో ప్రయోజనాల గురించి వారందరూ ఒకరితో ఒకరు చర్చించుకోవడం, తమ తమ అనుభవాలను పంచుకోవడం, అనుభవజ్ఞుల నుండి నేర్చుకోవడం చాలా ప్రస్ఫుటంగా కనిపించింది.

మన ప్రదర్శనను సందర్శించిన ప్రముఖులలో ఒకరైన, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు శ్రీ జి. చిన్నా రెడ్డి గారు మన సభ్యులతో చర్చించి, మన గ్రూపు యొక్క కార్యకలాపాల గురించి తెలుసుకుని, ఎంతో సంతోషించడమే కాకుండా, పట్టణాలలో మిద్దె తోటల పెంపకం అనే ఒక బృహత్ ప్రణాళికను రచించిన మన గ్రూపు ఫౌండర్లు శ్రీ శ్రీనివాస హర్కర గారిని, శ్రీమతి సరోజ గారిని మనస్ఫూర్తిగా అభినందించారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యాన శాఖ సంచాలకులు శ్రీమతి యస్మిన్ బాషా గారు, మన సభ్యులు పెంచుతున్న వివిధ రకాల మొక్కల గురించి, మన CTG చేబడుతున్న వివిధ కార్యక్రమాల గురించి శ్రీమతి సరోజ గారితో మాట్లాడి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపటమే కాక మన CTG లో ఆమె కూడా సభ్యులుగా చేరి మన కార్యక్రమాలలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. ఆమె వరుసగా రెండు రోజులు మన ప్రదర్శనను సందర్శించి, ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
విజయేందిర బోయి, ఐ.ఏ.ఎస్, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ; శ్రీ శివేంద్ర ప్రతాప్, ఐ ఏ యస్, అదనపు జిల్లా కలెక్టర్ ; అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, యస్.మోహన్ రావు, జిల్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు మొదలగు వారు విడివిడిగా కూడా CTG స్టాల్ సందర్శించి మన సేవలను గుర్తించి ప్రత్యేకంగా ప్రస్తావించారు

పట్టణాలలో మిద్దె తోటల పెంపకం వల్ల కలిగే లాభాల గురించి, సేంద్రీయ పధ్ధతిలో స్వయంగా మనమే మన మిద్దె తోటలలో కూరగాయలు పెంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, మనం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారితో జరిగిన అర్థవంతమైన చర్చలు, సంభాషణలు, వారు మన కార్యక్రమాల పట్ల వ్యక్తం చేసిన సంతోషము, పొగడ్తలు, మనందరినీ ఆనందంలో ముంచి ఉబ్బి తబ్బిబ్బు చేశాయి.

ఇంతే కాక మన ప్రదర్శనను సందర్శించిన వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, ప్రముఖులు కూడా మన CTG నిర్వహిస్తున్న కార్య కలాపాల గురించి తెలుసుకుని మనకి వారి నుంచి, వారి విభాగాల నుంచి కావలసిన సహకారం అందించటానికి ముందుకు వచ్చారు.

ప్రదర్శనకు విచ్చేసిన ఎంతో మందికి, వారు మన మహత్తర ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని, మిద్దె తోటల పెంపకం అనే ఉద్యమం పట్టణాలలో అప్రతిహతంగా కొన సాగాలని, చిన్న చిన్న మిద్దె తోటల పెంపకంతో పచ్చదనం పరిఢరిల్లాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని వివరించటం జరిగింది.
-TEAM CTG

Shopping Cart