Kalupumokkala dravanam

కలుపు మొక్కల ద్రావణం తయారీ విధానం

వివిధ రకాల కలుపు మొక్కల గడ్డలు, వేర్లు, పువ్వులు, కాయలు అన్ని భాగాలు, అన్ని మొక్కలవి సేకరించాలి. ఉదాహరణకు గరిక, తుంగ, గునుగు, వయ్యారిభామ, ఊద, పాయలాకు, అలం వంటి అనేక రకాల కలుపు మొక్కలు. వీటి వేర్లను శుభ్రంగా మట్టి లేకుండా కడిగి పచ్చి వాటినే ముక్కలు, ముక్కలుగా చేసి ఒక పెద్ద ఇనుప కడాయిలో వేసి మాడ్చాలి. ఇలా సుమారు గంట నుంచి రెండు గంటల సమయం వరకు మాడ్చి వేయిస్తే ఎర్రటి బొగ్గులుగా అవుతాయి. ఆ బొగ్గులను చూర్ణం చేసి గాలి చొరబడకుండా డబ్బాలో మూత బిగించి నిల్వ చేసుకోవాలి. దీనిలో ముఖ్యంగా మనకు అవసరమున్న ప్రధాన పంటల అవశేషాలు రానివ్వకూడదు

100 గ్రాముల కలుపు మొక్కల బొగ్గుపొడి, 100 గ్రాముల పంచదార, అరలీటరు దేశీ ఆవు పచ్చిపాలు (నీరు కలపకుండా) శుభ్రమైన డబ్బాలో కలుపుకోవాలి. తర్వాత 3 నుంచి 4 రోజుల వరకు లీటరు డబ్బా మూత గట్టిగా బిగించి రోజుకు 4-5 సార్లు ఒక నిమిషం సేపు దానిలోని ద్రావణం కలగలిసేలా గిలకొట్టాలి. దానిలోని కొవ్వు కరిగిపోయి ఆ ద్రావణం నల్లగా, చిక్కగా క్రూడాయిల్‌లా తయారవుతుంది. అందులో కార్బన్‌మోనాక్సైడ్‌ ఏర్పడుతుంది. రోజుకోకసారి మూత తీసి ఆ గాలిని విడుదల చేయాలి. ఈ ద్రావణాన్ని గరిష్టంగా 100 లీటర్ల నీటిలో కలుపుకొని 3 రోజులు, రోజుకు మూడుసార్లు సవ్య దిశలో కర్రతో తిప్పాలి. ద్రావణం పులిసిపోయి నీలిరంగుగా, పుల్లగా మారుతుంది. థైవాన్‌ ప్రెషర్‌ స్ర్పేయర్‌లో ఏమీ కలపకుండా ఆ ద్రావణాన్ని తీసుకొని కలుపు మొక్కల వేర్లు తడిచేలాగా నేలపై పిచికారీ చేస్తూ మొక్కను తడపాలి.

ఈ ఫార్ములాలో ఉన్న కలుపు మొక్కలకు సంబంధించిన అల్కలాయిడ్లు వేర్లపైన, గడ్డలపైన కవచంగా ఏర్పడి 3 గంటల్లోగా అవి నేల నుంచి నీరు, ఆహారం తీసుకోలేవు. తేలికపాటి కలుపు మొక్కలు వయ్యారిభామ లాంటి మొక్కలు 30 రోజుల్లో వడలిపోయి దానిలోని పత్రహరితం క్షీణించి ఆకులు మాడిపోయి చనిపోతాయి. గరిక, తుంగ లాంటి గట్టి కలుపు మొక్కలు 30 రోజుల తర్వాత మాడిపోతాయి. వాటి నుంచి కాల్షియం, మెగ్నీషియం మొదలగు సూక్ష్మపోషకాల్ని ప్రధాన పంట మొక్కలు గ్రహిస్తాయి. సాధారణంగా మళ్లీ ఆ కలుపు మొక్కలు మొలకెత్తవు. కానీ విత్తనాలు మళ్లీ నేలపై పడ్డప్పుడు మొలకెత్తే ఆస్కారముంది. డబ్బాలో సేకరించుకుని పెట్టిన కలుపు మొక్కల బొగ్గుపొడిని తొలకరి వానలు పడగానే కలుపు మూడు ఆకుల దశకు వచ్చినప్పుడు పిచికారీ చేయాలి. స్ర్పే చేసేటప్పుడు నేల తడిగా ఉండాలి. ప్రధాన పంటలపై ఈ గరళకంఠ కషాయం పడితే ఎలాంటి నష్టం ఉండదు. ఏ కలుపు మొక్క అల్కలాయిడ్లు ఆ కలుపు మొక్కలను నిర్మూలిస్తాయి

Shopping Cart