Fermented Fruit Juice as Fertilizer

పూత, కాయ, పండ్ల జాతి మొక్కలు సంవృద్దిగా పూలు, కాయ, పండ్లు రావటం కోసం చౌహాన్ క్యూ విధానంలో సూచించిన పులియపెట్టిన పండ్ల ఎరువు (ఫర్మెంటేడ్ ఫ్రూట్ ఫెర్టిలైజర్) తగు మోతాదు/నిష్పత్తిలో నీటిలో కలుపుకొని మొక్కల మీద చల్లితే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే ఈ పండ్ల ద్రావణం అడపా దడపా మట్టిపై చల్లుకుంటే వానపాముల వృద్దికి తోడ్పాటునిస్తుంది..

ముఖ్యమైన గమనిక/జాగ్రత్తలు:

1. తయారీ మరియు నిలువ చేసుకొనే క్రమంలో ఎట్టి పరిస్థితులలో నీళ్ళ తడి తగలకుండా జాగ్రత్త పడాలి. లేదంటే ఎరువు ఎక్కువ కాలం పాటు నిలువ ఉండదు.

2 . పుల్లటి పండ్లు(నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, దబ్బకాయ, పైనాపిల్, దానిమ్మ) కు వేరుగా మరియు తీపి పండ్ల(జామ, అరటి, బొప్పాయి, మామిడి, సీతాఫలం, పుచ్చ, పనస, ఆపిల్)కు వేరుగా చేసుకోవాలి.

3. పుల్లటి పండ్లతో చేసుకొన్న మిశ్రమం కేవలం ఆ జాతి మొక్కలకే వాడుకోవాలి. తీపి పండ్లతో చేసుకొన్న మిశ్రమం అన్ని రకముల మొక్కలకు వాడుకోవచ్చు.

4. తయారైన మిశ్రమాన్ని ప్లాస్టిక్, పింగాణి లేదా గాజు పాత్రలలో మాత్రమే నిలువ చేసుకోవాలి.

5. ఈ మిశ్రమాన్ని ఆకుకూరలకు ఎట్టి పరిస్తితులలో వాడకూడదు. పూత వచ్చి దిగుబడి తగ్గిపోతుంది.

పండ్ల ఎరువు (ఫ్రూట్ ఫెర్టిలైజర్) తయారు చేసుకొనే విధానం:

1. దీని తయారీకి సాదారణంగా మన ఇంట్లో వాడుకోగా మిగిలిన పండ్లు లేదా పాడైపోయిన పండ్లను కూడా వాడుకోవచ్చు.

2. పండ్ల వ్యర్ధాలకు సరిసమానంగా బెల్లం(పొడి లేదా తరుగు) తీసుకోవాలి.

3. ముందుగా పండ్ల వ్యర్ధాలను ఒక వెడల్పాటి పాత్రలో తీసుకోని కుదిరితే చేతితో/ పప్పు మెదుగుతో మెత్తగా అదుముకోవాలి(లేదంటే మిక్సీ వాడుకోండి).

4. గుజ్జుగా మారిన తరువాత అందులోకి సరిసమానంగా బెల్లం పొడి లేదా తరుగు వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి.

నిలువ చేసుకొనే విధానం:

1. తయారైన మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్, పింగాణి లేదా గాజు పాత్రలోకి మార్చుకొని మూత మాదిరిగా పైన పలుచాటి పొడి బట్ట(తేలికగా గాలి ప్రవాహానికి) కప్పి కట్టుకొని నిలువ చేసుకోవాలి. (మెటల్ పాత్రలు వాడరాదు)

2. మొదటి 15 రోజులు, ప్రతి రోజు ఒకసారి చెక్క/కర్రతో కలుపుకోవాలి.

3. పైన బూజులాగా ఏర్పడితే బెల్లం తగ్గినది అని అర్ధం. మిశ్రమం కలిపిన తరువాత కొంత బెల్లం పైన చల్లుకోని తిరిగి పొడి బట్ట కట్టుకోవాలి.

4. నీళ్ళ తడి తగలకుండా చూసుకొంటే ఈ మిశ్రమం సరసరిన 4-6 నెలల వరకు పాడవకుండా నిలువ ఉంటుంది.

ఫ్రూట్ ఫెర్టిలైజర్ వాడుకొనే విధానం:

1. పులిసిన ఫ్రూట్ ఫెర్టిలైజర్/పండ్ల ఎరువును ఒక లీటరు నీటికి 5-10 gms/ml నిష్పత్తిలో కలుపుకొని జాలితో వడపోసుకొని మొక్కలకు పూత/కాయ దశలో చల్లితే మంచి సత్ఫలితాలను ఇస్తుంది. దిగుబడి పెరుగుతుంది.

2. అలాగే మొక్కల వేర్లకు అందె విధంగా పోసుకొంటే వానపాముల ఎదుగుదలకు సహకరిస్తుంది మరియు నెల యొక్క సారంధ్రత(పోరోసిటి) పెంచుతుంది.

CTGian-Hemanth Kumar-

Shopping Cart